F Andhra Entertainment : వైఎస్ మృతిలో అంబానీ కుట్ర? Shocking News ??

హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి వెనుక రిలయన్స్ సంస్థ యజమానులు అంబానీ సోదరుల కుట్ర ఉందంటూ ఓ రష్యా వెబ్ సైట్ లో పెట్టిన సంచలనాత్మక కథనంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించిన గత ఏడాది సెప్టెంబర్ 2న వైఎస్ మరణించిన మరుసటి రోజునే 'ది ఎగ్జైల్డ్' అనే ఆ వెబ్ సైట్ వైఎస్ మృతికి అంబానీ సోదరులు కుట్రచేశారంటూ కథనం ప్రచురించిందని రాష్ట్రానికి చెందిన ఓ ఎలక్ట్రానిక్ మీడియా గురువారం రాత్రి ఫ్లాష్ వార్తలు ప్రసారం చేసింది. కేజీ బేసిన్ గ్యాస్ విషయంలో వైఎస్ పై అంబానీ సోదరులకు ఆగ్రహం ఉన్నదంటూ రష్యా వెబ్ సైట్ ప్రచురించినట్లు ఎలక్ట్రానిక్ మీడియా పేర్కొంది. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిలయన్స్ షాపులు, మాల్స్, కార్యాలయాలు, బంకులపై కాంగ్రెస్ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు దాడులకు దిగారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేసి రిలయన్స్ సంస్థల అద్దాలను పగలగొట్టారు. గురువారం రాత్రి పొద్దుపోయే వరకూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనితో రిలయన్స్ సంస్థకు చెందిన కార్యాలయాలు, బంకులు, దుకాణాల వద్ద పోలీసులు భారీగా మొహరించి గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.

రాష్ట్రంలోని చానళ్ళన్నీ ఒక్కసారిగా వైఎస్ మృతి వెనుక కుట్ర దాగి ఉండవచ్చంటూ పలు కథనాలు, అనుమానాలు లేవనెత్తాయి. దీనితో వైఎస్ అభిమానులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. మీడియాలో ఈ వార్త ప్రసారం అయిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. కూకట్ పల్లిలోని రిలయన్స్ ఔట్లెట్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేశారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా రిలయన్స్ కార్యాలయాలు, దుకాణాలపై దాడులు జరగడంతో మూసివేశారు. గుంటూరులో రాస్తారోకో నిర్వహించారు. కడపలో రేపు బంద్ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలోని అన్ని రిలయన్స్ దుకాణాలు, మాల్స్, కార్యాలయాల వద్ద ఆందోళకారులు ధర్నాకు దిగారు. పలు చోట్ల అంబానీ సోదరుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. రాష్ట్రంలోని అనేక పట్టణాలు, నగరాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు బలవంతంగా దుకాణాలను మూసివేయించారు. హిందూపురంలో అంబానీ సోదరుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

కాగా, వైఎస్ మృతిపై విచారణ నిర్వహిస్తున్న సిబిఐ, డిజిసిఐ దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం లేదని మాజీ డిజిపి పేర్వారం రాములు వ్యాఖ్యానించారు. అందుకే ఆయన మృతికి సంబంధించిన అంశాలను నాలుగు నెలలైనా బహిర్గతం చేయలేకపోతున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ రెండు దర్యాప్తు సంస్థలపైనా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, వైఎస్ కు ప్రముఖ అనుచరులలో ఒకరైన దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ, అంబానీ సోదరులకు రాష్ట్రంలో ఎవరితో సాన్నిహిత్యం ఉందో బయటకు రావాలన్నారు. వైఎస్ మరణం వెనుక కుట్ర ఉండి ఉంటుందని తాము మొదటి నుంచీ అనుమానిస్తున్నామన్నారు. రాష్ట్రంలోను, దేశంలోనూ ఓ ముఖ్యమైన నాయకుడి మరణం వెనుక రహస్యాలను వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ మృతి వెనుక కుట్ర ఉందంటూ అప్పటి నుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి మారెప్ప మరో మారు తన అనుమానమే నిజం అయిందన్నారు. ఇలా ఉండగా, తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టేందుకే ఇప్పుడు ఆకస్మికంగా ఈ వార్తను బయటపెట్టారంటూ కొందరు తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు.

అంబానీ సోదరులలో చిన్నవాడు అనిల్ అంబానీపైన కూడా ఇలాగే హత్యా యత్నం జరిగిందంటూ కొన్నాళ్ళ క్రితం వార్తలు వెలువడ్డాయి. తన ఇంటి నుంచి కార్యాలయానికి అనిల్ అంబానీ వెళ్ళే హెలికాప్టర్ ఇంధన ట్యాంకులో రాళ్ళు పెట్టారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ విషయం నిజమే అని తేలింది కూడా. అయితే అనిల్ ను హతమార్చేందుకు కుట్ర జరిగిందంటూ బయటపెట్టిన వ్యక్తి తరువాత అనుమానాస్పద స్థితిలో ముంబాయిలోని రైలుపట్టాలపై శవమై కనిపించాడు. అది ఇప్పటికీ మిష్టరీగానే ఉంది.

రష్యాకు చెందిన ది ఎగ్జైల్డ్ పత్రిక సంచలనాత్మక జర్నలిజానికి పెట్టింది పేరు. గతంలో రష్యా అధ్యక్షుడు గోర్భజెవ్ ను ఈ పత్రికి ముప్పు తిప్పలు పెట్టింది. 2008వ సంవత్సరం నుంచీ ఈ పత్రికను రష్యా ప్రభుత్వం నిషేధించింది. దానితో అప్పటి నుంచి ఆ పత్రిక యాజమాన్యం ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ ను నిర్వహిస్తున్నది.

Comments

0 Response to 'వైఎస్ మృతిలో అంబానీ కుట్ర? Shocking News ??'

Post a Comment

Newer Post Older Post Home i am everywhere except homepage